Ad

Tuesday, September 13, 2011

సకల జనుల సమ్మె

పాలనను స్తంభింపజేయండి
సకల జనుల సమ్మెకు కేసీఆర్ పిలుపు
ప్రతి ఒక్కరూ రోడ్లుపైకి రావాలి
ఉద్యోగులకు అండా నిలవాలి
14,15 సినిమా హాళ్ల బంద్‌నూ..
18న జాతీయ జాతీయ రహదారుల దిగ్బంధాన్ని విజయవంతం చేయాలి
రాష్ట్రాన్ని సాధించుకోలేకపోతే.
బానిసలుగా బతకాల్సి వస్తుంది!

సీఎం ఖబడ్దార్!.. ఎస్మా పెడితే రగిలిపోతాం
తెలంగాణ కోసం తల నరుక్కుంటా
టీజీ.. మా కోదండరామ్‌నే విమర్శిస్తావా?
పిచ్చ కూతలు కూస్తే.. నాలుక కోస్తాం జాగ్రత్త!
సన్నాసీ.. నీకు అంత కండకావరమా.. ఎన్ని గుండెలు నీకు?
రాయపాటి, కావూరిలకు సంస్కారం లేదు
కాంగ్రెస్‌కు దమ్ముంటే బాన్సువాడలో పోటీ చేయాలి
కరీంనగర్ జన గర్జన సభలో టీఆర్ఎస్ అధినేత
సకల జనుల సమ్మెలో బస్సు పయ్య తిరగదు. బడిగంట మోగదు. సింగరేణిలో బొగ్గు పెళ్ళ పెగలదు. రైలు చక్రం తిరగదు. ప్రభుత్వం స్తంభించిపోతుంది. సకల జనుల సమ్మె ఒక్క ఉద్యోగులకే పరిమితం కాదు. సమ్మె జరుగుతోందని ప్రజలు ఇళ్ళల్లో కూర్చోకూడదు. ప్రతి ఒక్కరూ మంగళవారం ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి సమ్మెను విజయవంతం చేసే దిశగా ఉద్యమాలు చేపట్టాలి. ఉద్యోగులకు అండగా ఉంటామనే భరోసా ఇవ్వాలి. చీమలదండులా కదిలి ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలి.
ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగిస్తే.. తెలంగాణ మొత్తం రగిలిపోతుంది. తెలంగాణ ప్రజలు అగ్గిబరాటాలుగా మారతారు. ఏ ఒక్క ఉద్యోగిపై ఈగ వాలినా సహించబోం. పిడికిలి ఎత్తిన న్యాయవాదుల మద్దతుతో న్యాయపోరాటం చేస్తామని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని హెచ్చరిస్తున్నా!
-జన గర్జన వేదిక నుంచి కేసీఆర్

కరీంనగర్, సెప్టెంబర్ 12: సకల జనుల సమ్మెకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైరన్ మోగించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం సకల జనుల సమ్మెలో భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. "తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం మినహా ప్రత్యామ్నాయమే లేదు. ఇప్పటికైనా తెలంగాణను సాధించుకోలేకపోతే కట్టు బానిసలుగా బతకాల్సి వస్తుంది'' అని జనగర్జన వేదిక నుంచి స్పష్టం చేశారు. "సకల జనుల సమ్మెలో బస్సు పయ్య తిరగదు. బడిగంట మోగదు. సింగరేణిలో బొగ్గు పెళ్ళ పెగలదు. రైలు చక్రం తిరగదు. ప్రభుత్వం స్తంభించిపోతుంది.

ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగిస్తే.. తెలంగాణ మొత్తం రగిలిపోతుంది. ఏ ఒక్క ఉద్యోగిపై ఈగ వాలినా సహించబోం. పిడికిలి ఎత్తిన న్యాయవాదుల మద్దతుతో న్యాయపోరాటం చేస్తాం'' అంటూ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని హెచ్చరించారు. ప్రజల తెలంగాణ కాంక్షను తీర్చాలంటూ సీఎంను డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారమిక్కడ జరిగిన జన గర్జన సభలో కేసీఆర్ ఆవేశంగా ప్రసంగించారు. సకల జనుల సమ్మె ఒక్క ఉద్యోగులకే పరిమితం కాదని, సమ్మె జరుగుతోందని ప్రజలు ఇళ్ళల్లో కూర్చోకూడదని ఆయన సూచించారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ మంగళవారం ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి సమ్మెను విజయవంతం చేసే దిశగా ఉద్యమాలు చేపట్టాలని టీఆర్ఎస్ అధినేత కోరారు.

ఉద్యోగులకు అండగా ఉంటామనే భరోసా ఇవ్వాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మొదలవుతున్న సమ్మెకు సంఘీభావంగా ఎక్కడికక్కడ తెలంగాణవ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని, 14, 15 తేదీల్లో సినిమా హాళ్ళ బంద్, కేంద్ర ప్రభుత్వానికి సమ్మె తీవ్రత తెలిసేలా 18న జాతీయ రహదారుల దిగ్బంధం జరగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమ భారాన్ని తమ భుజాన వేసుకున్న ఉద్యోగులపై ఎస్మా పెడితే తెలంగాణ ప్రజలు అగ్గిబరాటాలుగా రగిలిపోతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చీమలదండులా కదిలి ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని పిలుపునివ్వగా సభకు హాజరైన వారందరూ చేతులెత్తి తమ మద్దతు ప్రకటించారు.

సీఎం ఎవరి పక్షపాతో నేడే తేలాలి
"అవసరమైతే తెలంగాణ కోసం తలనరుక్కుంటా గానీ.. తల దించుకునేది లేదు'' అని కేసీఆర్ స్పష్టం చేశారు. 11 ఏళ్ళ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం ఇసుమంత కూడా తగ్గలేదనడానికి కరీంనగర్ జనగర్జన సభకు ప్రజలు హాజరైన తీరే నిదర్శనమన్నారు. "2006లో కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో.. కరీంనగర్-హైదరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 671 కోట్లు మంజూరు చేయించాను. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ. 234 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. నాటి సీఎం వైఎస్ మొండిచేయి చూపారు. ఇతర రాష్ట్రాలైతే మోకాళ్ళపై పరుగెత్తి పనులు చేయించుకుంటాయి.

కానీ.. ఇక్కడ సీమాంధ్ర పాలకులు ఉండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను చెల్లించలేదు'' అని విమర్శించారు. ఆరేళ్ళలో రూ. ఆరు లక్షల కోట్ల బడ్జెట్‌ను పాస్ చేయించుకున్న ప్రభుత్వం తెలంగాణకు కొత్త రైలు కోసం రూ. 234 కోట్లు చెల్లించలేకపోయిందని దుయ్యబట్టారు. "ఇది చాలదా తెలంగాణకు జరుగుతున్న ద్రోహమేమిటో తెలియడానికి..?'' అని కేసీఆర్ ప్రశ్నించారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రాంత పక్షపాతి కాకపోతే వెంటనే మంగళవారమే రూ. 234 కోట్లను డిపాజిట్ చేసి.. కరీంనగర్ రైల్వే మార్గం నిర్మాణానికి సుముఖత తెలిపి.. తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కేసీఆర్ సవాల్ విసిరారు.

బాన్సువాడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ
పెడితే తెలంగాణవాదులు మరోమారు కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయమని కేసీఆర్ జోస్యం చెప్పారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు సోమవారం సమావేశమైనప్పుడు.. బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాలని భావించినట్లు తనకు తెలిసిందని వెల్లడించారు. పోటీకి దిగితే 2006లో కరీంనగర్ ప్రజలు ఏం చేశారో మరోసారి బాన్సువాడలో తెలుస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ వారికి డిపాజిట్లు కూడా రావన్నారు.

పోలీసులూ.. ఇదేం పని?
వరంగల్‌లో యాకూబ్‌రెడ్డి తదితరులపై పోలీసులు పాశవికంగా వ్యవహరించిన తీరును జనగర్జన సభ తీవ్రంగా ఖండిస్తోందని కేసీఆర్ అన్నారు. "14ఎఫ్ రద్దు కోసం నేను దీక్ష చేసింది ఎవరి కోసం? పోలీసుల టోపీలు సీమాం«ధులు దక్కించుకుంటున్నారని.. నేను దీక్ష బూనితే.. విద్యార్థులు అండగా నిలిచి ఉద్యమాలు చేపట్టలేదా? అలాంటి విద్యార్థులను కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? గొడ్డును బాదినట్టు బాదారు'' అంటూ పోలీసులను ఆక్షేపించారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేసీఆర్ సభాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సభలో తెలంగాణ జేఎసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగ జేఎసీల ప్రతినిధులు స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, విఠల్, ఎంపీ విజయశాంతి, బీజేపీ నేతలు విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ, న్యూ డెమాక్రసీ నేత సూర్యం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, వివిధ జేఎసీల చైర్మన్లు రాజేందర్‌రెడ్డి, నర్సయ్య, రమేశ్, ఖాజా, మునీర్, కత్తి వెంకటస్వామి, పాపిరెడ్డి, రఘు, ఆనందం, థామస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Ad