Ad

Tuesday, September 13, 2011

ఉద్యమానికి ఊపిరి కరీంనగరే: కేసీఆర్

పదకొండేళ్ల ఉద్యమానికి ఊపిరి పోసింది కరీంనగర్ జిల్లా అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ‘జనగర్జన’ సభలో ఆయన కరీంనగర్ బిడ్డకు వందనం.. గడ్డకు వందనం అంటూ ప్రసంగించారు. తెలంగాణ ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగిస్తే తెలంగాణ రగిలిపోతోందని హెచ్చరించారు. ఉద్యోగుల వెంట నాలుగున్నర కోట్ల ప్రజలు, బీజేపీ, న్యూడెమెక్రసీ పార్టీలు ఉన్నాయన్నారు. పోచార శ్రీనివాస్‌రెడ్డి మీద పోటీ చేస్తే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు అని ఆయన అన్నారు. ఉద్యోగుల మీద ఈగ వాలినా న్యాయవాదులు ఊరుకోరని చెప్పారు. మంగళవారం నుంచి బడి గంట మోగదు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు, సింగరేణి స్తంభించిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జేఏసీ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదని టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ విద్యార్థి యాకుబ్‌రెడ్డిపై దాడి చేసిన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 2009లో పోలీసుల కోసమే విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారని ఆయన గుర్తు చేశారు. 14 ఎఫ్ తొలగించాలని వారు ఉద్యమం చేస్తే, ఇప్పుడు మీరు వారిపైనే లాఠీలు ఝులిపిస్తారా అని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసే సీమాంధ్రులే పనికి మాలిన వాళ్లని అన్నారు. సీమాంధ్రుల వెర్రి మాటలకు తెలంగాణ విద్యార్థులు వెనుకంజ వేయారని చెప్పారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడితే వాటికి రెట్టింపుగా తమ విద్యార్థులు ఉద్యమిస్తారని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Ad